Last Updated:
Israel Politics: ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను చేపట్టిన సెంట్రిస్ట్ ‘యాషర్’ పార్టీ అధినేత, మాజీ సైనిక చీఫ్ గాడి ఐసన్కోట్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశం ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన దశలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు తక్షణమే కొత్త నాయకత్వం అవసరమని స్పష్టం చేస్తూ.. జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ సభ్యులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జెరూసలేంలోని ప్రెసిడెంట్ నివాసంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ చేతుల మీదుగా ఐసన్కోట్ అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటు ఆదేశ పత్రాన్ని (మ్యాండేట్) అందుకున్నారు. నెతన్యాహు సుదీర్ఘ పాలనకు తెరదించుతూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు ఆరు వారాల గడువు లభించింది.
మ్యాండేట్ స్వీకరించిన అనంతరం ఐసన్కోట్ మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం అత్యంత సవాలుతో కూడిన ఎమర్జెన్సీ స్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. అనేక రంగాల్లో కొనసాగుతున్న సైనిక చర్యలు, అంతర్జాతీయ వేదికపై దెబ్బతింటున్న దేశ ప్రతిష్టను ఆయన ప్రస్తావించారు.
“ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య చరిత్ర ఎన్నడూ చూడని అత్యంత బలహీనమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇక్కడి నుంచి ఇంకా ఇదే ధోరణిలో ముందుకు సాగితే చీకటి మార్గంలోకి, సమాజంగా మనం తిరిగి కోలుకోలేని స్థితికి జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే కళ్లలోకి చూసి నమ్మగలిగే, ఇజ్రాయెల్ సంక్షేమం, భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా భావించే కొత్త నాయకత్వం దేశానికి ఎంతో అవసరం” అని ఆయన హెచ్చరించారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆషామాషీ కాదన్న విషయాన్ని అంగీకరించిన ఐసన్కోట్, జాతీయ అత్యవసర ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సరికొత్త, వినూత్న రాజకీయ వ్యూహాలను అనుసరిస్తామని తెలిపారు. సమయాన్ని వృథా చేసుకోవడానికో లేదా మళ్లీ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగడానికో ఇజ్రాయెల్‌కు వెసులుబాటు లేదని, సవాళ్లు అత్యంత తీవ్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే నెతన్యాహు పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా చేరే ప్రసక్తే లేదని ఐసన్కోట్ తేల్చిచెప్పారు.
120 మంది సభ్యులున్న నెసెట్ (పార్లమెంట్)లో 67 మంది చట్టసభ సభ్యులు ఐసన్కోట్ను ప్రధాని అభ్యర్థిగా సిఫార్సు చేయడంతో అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మద్దతులో 48 మంది యూదు వర్గానికి చెందినవారు కాగా, 19 మంది అరబ్ వర్గానికి చెందినవారు. అరబ్ పార్టీలు ఐసన్కోట్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని లేదా వ్యతిరేకంగా ఓటు వేయబోమని చెప్పినప్పటికీ.. యూదు బ్లాక్‌లోని కొందరు సభ్యులు మాత్రం అరబ్ పక్షాలపై ఆధారపడే సంకీర్ణంలో చేరేందుకు విముఖత చూపుతున్నారు.
ఈ పరిణామాలతో ఐసన్కోట్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక సంప్రదాయకంగా నెతన్యాహుకు మద్దతిచ్చే అల్ట్రా-ఆర్థోడాక్స్ పార్టీలతో సర్దుబాటు చేసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత సున్నితమైన రాజకీయ సమయమని పేర్కొన్న ఐసన్కోట్.. ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలను ఎవరూ అమలు చేయలేరని, ప్రభుత్వం ఏర్పడాలంటే అందరూ రాజీ పడక తప్పదని వ్యాఖ్యానించారు. దేశాన్ని మరో విడత అనిశ్చితి లోకి నెట్టే కొత్త ఎన్నికలను తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

