Last Updated:
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. 1,218 రోజుల్లోనే దేశ సమగ్రతను సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు.
స్వతంత్ర భారత దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి నవభారత నిర్మాణానికి బాటలు వేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, పటేల్‌ను అఖండ భారత్ శిల్పిగా అభివర్ణించారు. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఆయన చేసిన నిస్వార్థ త్యాగాలు, చూపిన దృఢ సంకల్పం వికసిత్ భారత్ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
వందలాది సంస్థానాలను విలీనం చేసి ఐక్య భారతదేశాన్ని ఆవిష్కరించిన పటేల్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటేల్ జన్మదినాన్ని ఏక్తా దివస్‌గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
మరోవైపు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశం ముక్కలైపోతుందని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారని ఆయన గుర్తుచేశారు.
అయితే స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కేవలం 1,218 రోజుల్లోనే ఎవరూ ఊహించని రీతిలో పటేల్ అద్భుతం సాధించారని కొనియాడారు. ఒక నాయకుల బృందం తమ జీవితకాలంలో కూడా చేయలేని బృహత్తర కార్యాన్ని పటేల్ ఒంటిచేత్తో పూర్తి చేసి అఖండ భారతాన్ని నిర్మించారని ప్రశంసించారు.
గుజరాత్‌లోని ఏక్తా నగర్లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. దేశ రక్షణ, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పటేల్ సేవలను స్మరిస్తూ వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు.

