Last Updated:
Rahul Gandhi: ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, రాహుల్ గాంధీ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం 91వ కిలోమీటర్ మైలురాయి వద్ద చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఐదు వాహనాలతో పాటు ఒక అంబులెన్స్ ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, భద్రతా సిబ్బందితో సహా పలువురు వ్యక్తులు గాయపడ్డారు. సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీ లక్నో నుంచి అక్కడికి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
వార్తా సంస్థ పీటీఐ (PTI) కథనం ప్రకారం.. రాయ్‌బరేలీ ఎంపీ అయిన రాహుల్ గాంధీ సోమవారం ఉదయం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు తరలివచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సుల్తాన్‌పూర్‌కు పయనమయ్యారు.
BIG BREAKING 🚨
Vehicles in the convoy of Leader of Opposition #Rahul Gandhi ji, who had left Sultanpur Court from Lucknow, collided with each other on the #Purvanchal Expressway.In this powerful collision, some Congress workers have also been injured. #Rahul Gandhi ji is completely safe.
#Rahul Gandhi ji was going to Sultanpur for the hearing of an old case where he had to reach the #MP/MLA court.
— SUDHIR (@SUDHIRb9661) October 26, 2026
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులో జరిగిన ఓ ర్యాలీలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుల్తాన్పూర్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్, స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ 2023లో కోర్టు ఎదుట హాజరై బెయిల్ పొందారు.
ఈ కేసులో తీర్పును తొలుత అక్టోబర్ 13న వెల్లడించాల్సి ఉండగా, అనంతరం అక్టోబర్ 26కు వాయిదా వేశారు. తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సుల్తాన్‌పూర్‌తో పాటు ప్రత్యేకించి కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

