Last Updated:
వైవిధ్యమైన ప్రేమకథతో నేటితరం ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంగా వచ్చిన తాజా ఎమోషనల్ డ్రామా ‘హైకూ’. మరి ఈ సినిమా ఎలా ఉందో చుద్దామా.
వైవిధ్యమైన ప్రేమకథతో నేటితరం ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంగా వచ్చిన తాజా ఎమోషనల్ డ్రామా ‘హైకూ’. యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్, మైమ్ గోపి కీలక పాత్రలు పోషించగా.. డాక్టర్ అరుళానంధు, మ్యాథ్యూ అరుళానంధు నిర్మించారు. ఈ రోజే (అక్టోబర్ 23) థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
అమ్మాయిల కాలేజీలో చేరిన ఏకైక అబ్బాయి మనోహర్ (ఏగన్). అక్కడ ర్యాగింగ్‌కు గురవుతున్న అతనికి జాబిలి అలియాస్ కోడి (శ్రీదేవి)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అయితే పెళ్లి పీటల వరకు వెళ్లిన వీరి బంధం ఊహించని కారణాల వల్ల విడిపోతుంది. ఆ బ్రేకప్ బాధలో ఉన్న మనోహర్ ఆఫీసులో నివేదా (ఫెమినా జార్జ్) అప్రెంటీస్‌గా చేరుతుంది. అప్పటికే ప్రేమలో విఫలమై బాధపడుతున్న నివేదాకు, మనోహర్‌కు మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారుతుంది. వీరిద్దరి గతం ఈ కొత్త ప్రేమపై ఎలాంటి ప్రభావం చూపింది? ఈ ముగ్గురి ప్రయాణం చివరకు ఎలా ముగిసింది? అన్నదే కథ.
ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటులే. జాబిలి పాత్రలో శ్రీదేవి సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య, పాత జ్ఞాపకాల మధ్య నలిగిపోయే యువకుడిగా ఏగన్ బాగానే నటించాడు. అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ కావడం అనేది కొత్త పాయింట్ అయినా దాన్ని ప్రెసెంట్ చేయడంలో మాత్రం తడబాటు కనిపించింది. ఫస్టాఫ్ లో అంతగా చెప్పుకోదగిన సన్నివేశాలు లేవు కానీ, సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే ఫెమినా జార్జ్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాకు కొంత ప్లస్ అయ్యింది. సగటు ప్రేక్షకుడి ఊహకు అందేలా రాసుకున్న సీన్స్ బోర్ ఫీలింగ్ తెప్పించాయి. ప్రేమ జంటలోని ఎమోషన్‌ను పండించడంలో విఫలమయ్యారనే చెప్పుకోవాలి. కథను ఇంకాస్త సానపడితే కిక్కు మరోలా ఉండేది.
నేటి జెన్-జి (Gen-Z) యువత, వారి రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్ వల్ల పడే మానసిక సంఘర్షణను దర్శకుడు యువరాజ్ చిన్నస్వామి బాగానే ఎంచుకున్నారు. సిద్దూ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా ఫీల్‌ను ఎలివేట్ చేశాయి. పియూష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
నేటి యువతకు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ లవ్ కాన్సెప్ట్
శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ నటన
ఫస్టాఫ్
కొన్ని సన్నివేశాల్లో సాగదీత
రొటీన్ సీన్స్
చివరగా.. రొటీన్ సన్నివేశాలను పక్కనపెడితే, ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది.
రేటింగ్: 2.25

