ఈ రైలులో రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్స్ (DPCలు), ఎనిమిది ట్రైలర్ కోచ్‌లు (TCలు) ఉన్నాయి. ప్రతి DPCలో ఫ్యూయల్ సెల్స్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలు, హైడ్రోజన్ నిల్వ సిలిండర్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి రైలుకు అవసరమైన శక్తిని అందిస్తాయి. రైలు రెండు చివరల్లో ఒక్కో పవర్ కార్ ఉంటుంది. ఒక్కో DPC 1,200 కిలోవాట్లు (1,600 హార్స్‌పవర్) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండు కలిపి రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిపే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడుస్తుంది. జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్‌తో పాటు జింద్ సిటీ, పాండు పిందారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భాంభేవా, ఈసాపూర్ ఖేరీ హాల్ట్, బుటానా హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రబ్రా హాల్ట్, లాథ్ హాల్ట్, మొహానా, బర్వాస్నీ హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో కూడా సేవలు అందిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో హైడ్రోజన్ రైలును నడిపితే అది ఎంత సురక్షితంగా, నమ్మకంగా పనిచేస్తుందో పరీక్షించేందుకు ఈ మార్గాన్ని ఎంపిక చేశారు. జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, కంప్రెషన్, రీఫ్యూయలింగ్ కేంద్రం ఈ రైలుకు ఇంధనం అందిస్తుంది. దీంతో దేశంలో తొలి సమగ్ర హైడ్రోజన్ రైల్వే వ్యవస్థ ఏర్పడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)

