Last Updated:
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నెట్‌వర్క్18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ప్రత్యేక ఇంటర్వ్యూ.
భారత్, అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు అక్టోబర్ 20న ముంబై పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియ దాదాపు పూర్తయిందని రూబియో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
రూబియో ముంబై పర్యటనలో మరో ముఖ్యమైన కార్యక్రమం కూడా ఉంది. సాయంత్రం 6.35 గంటలకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ‘ఫ్రీడమ్ 250 రిసెప్షన్’లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా అమెరికా చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలను, భారత్-అమెరికా దౌత్య సంబంధాలను హైలైట్ చేయనున్నారు.
ఈ పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నెట్‌వర్క్18 ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. భారత్‌తో పాటు భారతీయ ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలపై ఈ ఇంటర్వ్యూలో చర్చించనున్నారు. భారత్-అమెరికా సంబంధాలు, వాణిజ్య ఒప్పందం, రెండు దేశాల మధ్య సహకారంపై రూబియో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో అనేదానిపై ఆసక్తి నెలకొంది.
ముంబైలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 21 బుధవారం నాడు రూబియో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు బయలుదేరుతారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10.30 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జామ్‌నగర్‌కు పయనమవుతారు.
ఇదిలా ఉంటే, భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై రూబియో సోమవారం కీలక సంకేతాలు ఇచ్చారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాయని, దాదాపు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. దీంతో రూబియో భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం గురించి ఏవైనా కీలక విషయాలు బయటకు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

