Last Updated:
Smit Machchhar: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలో కో-పైలట్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి దాడికి దిగిన ఘటనలో భారత సంతతికి చెందిన ‘ఫ్లైదుబాయ్’ కెప్టెన్ స్మిత్ మచ్చార్ (Smit Machchhar) తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానం కాక్‌పిట్‌లో జరిగిన ఆ భయానక ఘటనను, ప్రాణాలు నిలుపుకోవడానికి తాను చేసిన పోరాటాన్ని స్కై న్యూస్ అరేబియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
విమానం టేకాఫ్ అయిన సుమారు రెండు గంటల వరకు ప్రయాణం సాధారణంగానే సాగింది. టెల్ అవీవ్ నుంచి తిరుగు ప్రయాణాన్ని నడపాల్సిన మరో పైలట్‌ను నమాజ్ చేసుకోవాలని చెప్పి కో-పైలట్ కాక్‌పిట్ నుంచి బయటకు పంపించాడు. ఆ సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిత్, కో-పైలట్ మాత్రమే ఉన్నారు. స్మిత్ ల్యాండింగ్ సమయం, ఇంధనం, వాతావరణ వివరాలను కంప్యూటర్లో పరిశీలిస్తున్న తరుణంలో కో-పైలట్ వెనుక నుంచి ఆయన తలపై బలంగా కొట్టాడు.
తొలుత విమానం పైకప్పు ఏదైనా ఊడి పడిందేమోనని స్మిత్ భావించారు. అయితే వెంటనే తేరుకుని చూసేసరికి కో-పైలట్ అర్థం కాని మాటలు మాట్లాడుతూ తనపై నిరంతరాయంగా దాడి చేస్తున్నట్లు గ్రహించారు. ఆ దెబ్బ తీవ్రతకు క్షణాల్లో చూపు మసకబారిపోయిందని, తదుపరి దెబ్బల నుంచి తనను తాను రక్షించుకోవడానికి వెంటనే సీట్ బెల్ట్ విప్పి ప్రతిఘటించానని స్మిత్ తెలిపారు.
తల నుంచి రక్తం కారుతుండటంతో స్మిత్ స్పృహ కోల్పోతూ, మళ్లీ తేరుకుంటూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో బయట ఉన్న పైలట్‌ను అప్రమత్తం చేయడానికి తలుపు తెరవాలని గట్టిగా అరిచారు. అయితే, తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, బయట ఉన్న వారిని కూడా కొడతానని కో-పైలట్ బెదిరించి మళ్లీ తలుపు మూసేశాడు.
ఒక దశలో విమానం ఇంజిన్ శబ్దం తగ్గి, విమానం కిందికి వేగంగా దిగుతున్నట్లు (డైవ్ అవుతున్నట్లు) స్మిత్ గ్రహించారు. “రక్తస్రావం వల్ల స్పృహ కోల్పోతున్నప్పటికీ, ఎలాగైనా బతకాలన్న సంకల్పంతో చివరివరకు పోరాడాను” అని ఆయన పేర్కొన్నారు. తీవ్రంగా శ్రమించి కాళ్ళతో నెట్టుకుంటూ కాక్‌పిట్ తలుపును తెరిచి విమాన సిబ్బందికి అందుబాటులోకి వచ్చారు. వెంటనే మరో పైలట్ నియంత్రణలోకి తీసుకుని విమానాన్ని సౌదీ అరేబియాలో అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో 174 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్యాప్తు వివరాల ప్రకారం.. ఒమన్‌కు చెందిన 29 ఏళ్ల కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి (Hamam al-Hammami) ఈ దాడికి పాల్పడ్డాడు. అమెరికాలోని 9/11 తరహా ఉగ్రదాడి ప్రేరణతో, విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని టెల్ అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ను ఢీకొట్టాలని, తద్వారా భారీ ప్రాణనష్టం కలిగించాలని అతడు కుట్ర పన్నినట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు.
కాక్‌పిట్‌లో ఉండే గొడ్డలి (Crash Axe)తో అతడు కెప్టెన్‌పై దాడి చేయగా, నిమిషం వ్యవధిలోనే విమానం సుమారు 14,000 నుంచి 16,000 అడుగుల మేర కిందికి పడిపోయింది. ప్రస్తుతం యూఏఈలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్.. సౌదీ, యూఏఈ ప్రభుత్వాలు తనకు అందించిన వైద్య సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.

