నీలోజుపల్లి గ్రామానికి చెందిన రాజు, అంజలి దంపతులు గతంలో తమకున్న ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసేవారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, నీటి లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల విధానాన్ని మార్చుకున్నారు. ఇందులో భాగంగా సుమారు మూడున్నర ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, అంతర పంటలుగా బెండకాయ, టమాట, మిర్చి, కాలీఫ్లవర్‌తో పాటు బంతిపూలు, పట్టుకుచ్చులు, వేరుశెనగను సాగు చేస్తున్నారు.
ఈ విధంగా ఒకే భూమిలో విభిన్న పంటలు పండించడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయని రైతు రాజు తెలిపారు. గతంలో వరి సాగుతో ఎకరాకు సుమారు రూ.50 వేల ఆదాయం వచ్చేదని, ప్రస్తుతం కూరగాయల సాగుతో ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోందని వివరించారు. అయితే పంటల దిగుబడి, మార్కెట్ ధరలు, సాగు ఖర్చులను బట్టి ఆదాయం మారుతుందని పేర్కొన్నారు.
బెండకాయ విత్తనాలు నాటిన రెండు నెలల తర్వాత దిగుబడి ప్రారంభమై, 45 నుంచి 60 రోజుల పాటు పంట చేతికి వస్తుందని రాజు చెప్పారు. టమాట పంటలో రెండు నెలల తర్వాత దిగుబడి మొదలై సుమారు 60 నుంచి 70 రోజుల పాటు ఉత్పత్తి లభిస్తుందని వివరించారు. మిర్చి పంటలో రెండు నెలల తర్వాత దిగుబడి ప్రారంభమై దాదాపు నాలుగు నెలల పాటు కాయలు కోసుకోవచ్చన్నారు. కాలీఫ్లవర్‌లో నాటిన మూడు నెలలకు దిగుబడి వస్తుందని తెలిపారు.
బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని బంతిపూలను సాగు చేస్తున్నారు. బతుకమ్మ కోసం ప్రత్యేకంగా పట్టుకుచ్చులు కూడా పండిస్తున్నారు. పండుగల సమయంలో పూలకు డిమాండ్ ఉండటంతో అదనపు ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని రైతు దంపతులు భావిస్తున్నారు.
రైతు దంపతుల వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ కూరగాయల దిగుబడి, సాగు విధానం, ఆదాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో వరికి బదులుగా కూరగాయలు, కందులు, పెసర్లు, మినుములు, మొక్కజొన్న, ఆముదం, నువ్వులు, వేరుశెనగ, శనగలు, పొద్దుతిరుగుడు, ఆయిల్ పామ్ వంటి పంటలను పరిశీలించాలని తెలిపారు. ఉద్యానవన పంటలకు నీటి వినియోగాన్ని తగ్గించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ఉపయోగించాలని సూచించారు. వచ్చే యాసంగిలో మొత్తం విస్తీర్ణంలో కూరగాయల సాగు చేపట్టాలని రైతు రాజుకు సూచించారు.
బోయినపల్లి మండలం వరదవెల్లిలో రైతు తరిగొప్పుల మురళి నాలుగు ఎకరాల 20 గుంటల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలోనూ కలెక్టర్ పాల్గొన్నారు. వీబీ-జీ రామ్-జీ పథకం కింద కూలీలతో గుంతలు తవ్వించి మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. మొదటి మూడేళ్లపాటు మొక్కల సంరక్షణ, కలుపు తొలగింపు వంటి పనులకు కూలీల సేవలు వినియోగించనున్నట్లు వివరించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించారు. ఆయిల్ పామ్ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
రత్నంపేట గ్రామపంచాయతీ పరిధిలో రైతు కౌటగాని పద్మ ఆయిల్ పామ్ తోటలో నిర్మిస్తున్న పామ్ పాండ్ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణానికి ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో పనులు జరుగుతున్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం జలసిరి కింద పామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు రైతులు, గృహ నిర్మాణదారులు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ షరీఫోద్దీన్, ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
