Last Updated:
దేవుడి ముందు అగరబత్తి వెలిగించడం ప్రతి ఇంట్లో కనిపించే సంప్రదాయం. కానీ దీన్ని ఉదయం ఏ సమయంలో, సాయంత్రం ఏ సమయంలో వెలిగించాలి? అసలు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? అగరబత్తి పొగకు, భక్తికి ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ఏమిటి?
హిందూ సనాతన ధర్మంలో పూజా విధానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. దేవుడికి పూలు, దీపం సమర్పించడంతో పాటు అగరబత్తి లేదా ధూపం వెలిగించడం కూడా సంప్రదాయంగా వస్తోంది. అయితే అగరబత్తిని ఏ సమయంలో వెలిగించాలి? ఈ ఆచారం ఎలా మొదలైంది? భక్తికి, ధూపానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు చాలామందికి ఆసక్తికరంగా ఉంటాయి.
శాస్త్రాల ప్రకారం ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాల్లో ధూపం సమర్పించడం ప్రశస్తమైనదిగా భావిస్తారు. ఉదయం సూర్యోదయానికి ముందు 4:30 నుంచి 6:00 గంటల మధ్య, అంటే బ్రాహ్మీ ముహూర్తం లేదా ఉషఃకాలంలో పూజ చేసి అగరబత్తి వెలిగించడం మంచిదని చెబుతారు. ఈ సమయంలో ధూపం వేయడం వల్ల ఇల్లు ప్రశాంతమైన, సత్త్వగుణ వాతావరణంతో నిండుతుందని విశ్వాసం. అలాగే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో, సాధారణంగా 5:30 నుంచి 6:30 గంటల మధ్య దీపారాధనతో పాటు అగరబత్తి వెలిగించే సంప్రదాయం ఉంది. పగలు, రాత్రి కలిసే ఈ సంధి సమయంలో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరంగా ఉండి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
అగరబత్తి సంప్రదాయానికి మూలాలు వేదకాలంలోని యజ్ఞ, యాగ సంస్కృతిలో ఉన్నాయని చెబుతారు. అప్పట్లో ఋషులు, మునులు యజ్ఞాల్లో సమిధలు, నెయ్యి, గుగ్గిలం, సాంబ్రాణి, చందనం వంటి సుగంధ ద్రవ్యాలను ఆహుతిగా సమర్పించేవారు. హోమం నుంచి వెలువడే పొగ వాతావరణాన్ని శుద్ధి చేసేదని భావించేవారు. కాలక్రమంలో ఇంట్లో ప్రతిరోజూ పెద్ద యజ్ఞాలు చేయడం సాధ్యం కాకపోవడంతో, ఆ ధూప సంప్రదాయం సరళమైన రూపంలో అగరబత్తిగా మారిందని చెబుతారు. అగరు అనే సుగంధ వృక్షం జిగురు, పొడితో తయారు చేయడం వల్ల దీనికి అగరబత్తి అనే పేరు వచ్చింది.


