Last Updated:
Iran War: పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఊహించని రీతిలో దాడులు పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ కాన్సులర్ వ్యవహారాల విభాగం తమ పౌరులకు అత్యవసర భద్రతా హెచ్చరిక జారీ చేసింది.
ఆ ప్రాంతంలో ఉన్న అమెరికన్ పౌరులు అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో భద్రతా వాతావరణం అత్యంత సంక్లిష్టంగా ఉందని అమెరికా పేర్కొంది. ఈ ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడం, గగనతల మార్గాలు మూసివేయడం మరియు ఇతర ప్రయాణ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పౌరులు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మధ్య కొనసాగుతున్న దాడులను ఈ హెచ్చరికలో ప్రధానంగా ప్రస్తావించారు. పౌర విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, ఈ సైనిక ఘర్షణ ఎప్పుడైనా అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వెలుపల ఉన్న అమెరికన్లు ఆ ప్రాంతానికి లేదా ఆ మార్గాల ద్వారా చేసే ప్రయాణాలను తీవ్రంగా పునఃసమీక్షించుకోవాలని (వాయిదా వేసుకోవాలని) సూచించింది. అత్యవసరంగా ప్రయాణించేవారు విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరింది.
మిడిల్ ఈస్ట్‌లోనే కాకుండా, ఆ ప్రాంతం వెలుపల ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాలు కూడా దాడులకు గురయ్యే ముప్పు ఉందని విదేశాంగ శాఖ హెచ్చరించింది. విదేశాల్లోని అమెరికా ప్రయోజనాలు, అమెరికన్ పౌరులు నివసించే ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు మరియు సంబంధిత విభాగాలను ఇరాన్ లేదా ఇరాన్ అనుకూల గ్రూపులు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని పేర్కొంది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కీలక, సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు శనివారం ప్రకటించిన కొద్దిసేపటికే అమెరికా ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఈ దాడి నేపథ్యంలో రియాద్ విమానాశ్రయం సమీపంలో మంటలు, భారీగా నల్లటి పొగ వెలువడినట్లు సమాచారం అందింది. దీంతో సౌదీ అధికారులు వైమానిక దాడి ముప్పుపై నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే, రియాద్ దిశగా దూసుకొచ్చిన శత్రు క్షిపణిని తమ వాయు రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్) గాల్లోనే అడ్డుకుని విజయవంతంగా ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా సైనిక సంకీర్ణ దళం స్పష్టం చేసింది. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరినట్లు అధికారులు ప్రకటించారు. ఈ దాడులకు తామే బాధ్యులమని హౌతీలు ప్రకటించినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

