Last Updated:
మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు జీవిత చరిత్ర, బోధనల ఆధారంగా తెరకెక్కిన పౌరాణిక, ఆధ్యాత్మిక చిత్రం “జయహో రామానుజ”. ఈ రోజే (అక్టోబర్ 24) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
సమాజంలో కుల, మత భేదాలు లేవని, మానవులంతా సమానమే అని 11వ శతాబ్దంలోనే లోకానికి చాటిచెప్పిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. ఆయన జీవిత చరిత్ర, బోధనల ఆధారంగా తెరకెక్కిన అత్యద్భుత పౌరాణిక మరియు ఆధ్యాత్మిక చిత్రం “జయహో రామానుజ”. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయి ప్రసన్న, ప్రవళ్లిక సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లయన్ డాక్టర్ సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషించారు. అమెరికాకు చెందిన ప్రముఖ నటి జో శర్మ హీరోయిన్గా నటించగా, సీనియర్ నటుడు సుమన్, ప్రవళ్లిక, గురురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ రోజే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ: 11వ శతాబ్దంలో భూలోకంలో మానవులు కుల మతాల పేరుతో ఒకరినొకరు చంపుకుంటూ, తీవ్ర అసమానతలతో జీవిస్తున్న సమయం అది. ఈ పరిస్థితులను చూసిన శ్రీమహావిష్ణువు.. భూలోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, తారతమ్యాలను రూపుమాపడానికి తన అంశతో శ్రీ రామానుజాచార్యులకు జన్మనిస్తాడు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్‌లో ఓ సాంప్రదాయ బ్రాహ్మణ దంపతులు చేసిన పుత్రకామేష్ఠి యాగం ఫలితంగా ఆయన జన్మిస్తారు. తండ్రి సంరక్షణలో వేదాలు అభ్యసించిన అనంతరం, కంచికి వెళ్లి యాదవ ప్రకాశుల వద్ద ఉన్నత విద్యను అభ్యసించేందుకు పయనమవుతారు. ఆ తర్వాత రామానుజాచార్యుల జీవితంలో చోటుచేసుకున్న మలుపులు, అడ్డంకులను అధిగమించి సమాజంలో అన్ని కులాలు, మతాలు ఒక్కటే అని ఎలా స్థాపించారనేది ఈ చిత్ర ప్రధాన కథ.
నేటి యువతకు రామానుజాచార్యుల గొప్పతనాన్ని తెలియజేయాలనే సదుద్దేశంతో దర్శకుడు సాయి వెంకట్ ఎంచుకున్న కథాంశం, స్క్రీన్ ప్లే అభినందననీయం. కంచి రాజు కుమార్తెను ఓ దుష్టశక్తి నుంచి కాపాడే ఘట్టం ప్రేక్షకులను రోమాంచితం చేస్తుంది. ఈ సన్నివేశంలో ఉపయోగించిన గ్రాఫిక్స్ (VFX) సహజత్వానికి దగ్గరగా ఉండి సినిమా స్థాయిని పెంచాయి. అలాగే, శ్రీమహావిష్ణువు దశావతారాలను తెరపై ఆవిష్కరించిన తీరు కనువిందు చేస్తుంది. ప్రీ-క్లైమాక్స్‌లో చంద్రగిరి మహారాజు సమక్షంలో శ్రీ వేంకటేశ్వరుడు ఏ వర్గానికి చెందినవాడనే అంశంపై శైవ, వైష్ణవ భక్తుల మధ్య జరిగే వాదనలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అష్టాదశ పురాణాల వివరణతో సాగే ఈ వాదనల అనంతరం, బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయాలని మహారాజు ఆదేశించే సన్నివేశం ప్రేక్షకులలో భక్తిభావాన్ని రగిలిస్తుంది.
నటీనటుల పనితీరు: రామానుజాచార్యులుగా, శ్రీమహావిష్ణువుగా, దశావతారాల్లో లయన్ సాయి వెంకట్ నటన అద్భుతంగా సాగింది. ఆయన పలికిన ఆధ్యాత్మిక సంభాషణలు ఆకట్టుకుంటాయి. జో శర్మ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించగా, ఢిల్లీ సుల్తాన్‌గా సీనియర్ నటుడు సుమన్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో ప్రవళ్లిక, తిరు మంత్రోపదేశం చేసే గురువుగా నిర్మాత గురురాజ్ ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. భక్తిరస ప్రధానమైన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను ముందుకు నడిపించడంలో కీలకంగా మారాయి. సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. ఎడిటింగ్‌లో చిన్న చిన్న జర్క్స్ మినహాయిస్తే సినిమా ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా ముగింపులో “అవతార్ రామానుజ 2” (Avatar Ramanuja 2) పేరుతో సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
చివరగా.. ఈ తరానికి గొప్ప సందేశమిచ్చే కాన్సెప్ట్ ఇది
రేటింగ్: 2.75

