Last Updated:
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఊరటనిస్తూ ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లతో పాటు డేటా అవసరం లేని వారి కోసం తక్కువ ధరకే వాయిస్, ఎస్ఎంఎస్ ప్యాక్‌లు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలోని కోట్లాది మంది ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ భారత టెలికాం నియంత్రణ మండలి (TRAI) కీలక నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కొత్తగా జారీ చేసిన ‘టెలికాం కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ (13వ సవరణ) నిబంధనలు-2026’ ప్రకారం.. టెలికాం సంస్థలు ఇకపై వినియోగదారులకు 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్ ప్లాన్లతో పాటు కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు మాత్రమే ఉండే చౌక ప్లాన్లను తప్పనిసరిగా అందించాలి. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం (సెప్టెంబర్ 27) సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
ఏడాదికి 12 నెలలు మాత్రమే ఉంటే టెలికాం కంపెనీలు నెలకు 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తూ ప్రజలతో ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయిస్తున్నాయని గతంలో తాను పార్లమెంటులో గళం విప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాను లేవనెత్తిన ఈ సమస్యపై ట్రాయ్ స్పందించి సెప్టెంబర్ 22న కొత్త నిబంధనలను నోటిఫై చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం కంపెనీలు డేటా (ఇంటర్నెట్)తో కూడిన బండిల్డ్ ప్లాన్లను ఏయే వ్యాలిడిటీలతో ఇస్తున్నాయో, అవే వ్యాలిడిటీలతో (30 రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు) డేటా లేని ‘వాయిస్-ఎస్ఎంఎస్ ఓన్లీ’ స్పెషల్ టారిఫ్ వోచర్లను (STV) తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ గడువు ముగిసేలా (మమంత్లీ రెన్యువల్) ప్రత్యేక ప్లాన్లను కూడా తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది.
ఈ నిర్ణయం వల్ల మొబైల్ ఇంటర్నెట్ వాడని సామాన్యులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) ఎంతో మేలు జరగనుంది. కేవలం ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్ కోసమే ఫోన్ వాడే వారు ఇకపై అనవసరంగా డేటా ప్యాక్‌ల కోసం అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో తమ ఆర్థిక స్తోమతకు తగినట్లుగా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 7న ట్రాయ్ విడుదల చేసిన ముసాయిదాపై 1,132 మంది భాగస్వాముల నుంచి అభిప్రాయాలు సేకరించి, జూన్ 15న బహిరంగ చర్చ నిర్వహించిన అనంతరం ఈ తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలకు ప్రజల మద్దతు తోడైతే వ్యవస్థలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయనేందుకు ఇదొక గొప్ప ఉదాహరణ అని, నిర్మాణాత్మక రాజకీయాలకు ఇది నిదర్శనమని ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

