ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి పంట సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ (DA&FW) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, రాష్ట్రాల వారీగా మరియు నెలవారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేస్తుంది. ఈ అంచనాల ఆధారంగా ఎరువుల విభాగం (DoF) రాష్ట్రాలకు నెలవారీ సరఫరా ప్రణాళిక రూపొందించి, అవసరమైన మేరకు యూరియా, డీఏపీ (DAP), ఎంఓపీ (MOP), ఎన్‌పీకేఎస్ (NPKS) వంటి ఎరువులను కేటాయిస్తుంది. అనంతరం వాటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే అదనపు సరఫరా చర్యలు కూడా చేపడుతుంది. దేశవ్యాప్తంగా రాయితీపై అందించే అన్ని ప్రధాన ఎరువుల రవాణాను ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (iFMS) అనే ఆన్‌లైన్ వెబ్ ఆధారిత వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీంతో ఎక్కడ ఎంత ఎరువు అందుబాటులో ఉంది, ఎక్కడ కొరత ఏర్పడే అవకాశం ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత సరఫరా జరిగింది వంటి వివరాలను రియల్ టైమ్‌లో గుర్తించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

