క్రెడిట్ కార్డ్ వడ్డీని వ్యక్తిగత రుణాల కంటే కూడా ఖరీదైన వడ్డీలలో ఒకటిగా భావిస్తారు. మీరు ప్రతి నెల కనీస బకాయి (Minimum Due) మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు వదిలేస్తే, దానిపై అధిక వడ్డీ పడుతుంది. ఇప్పటికే అద్దె చెల్లించేందుకు మీరు చెల్లించిన సౌకర్య రుసుము దీనికి జత కావడంతో, చివరికి మీరు చెల్లించే మొత్తం అసలు అద్దె కంటే గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బిల్లును పూర్తిగా చెల్లించే సామర్థ్యం లేకుంటే, అద్దె కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించడం ఆర్థికంగా భారంగా మారవచ్చు. క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించే ముందు మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి బ్యాంకు, ప్రతి క్రెడిట్ కార్డ్‌కు వేర్వేరు నిబంధనలు ఉంటాయి. కొన్ని బ్యాంకులు అద్దె చెల్లింపులను రివార్డ్ పాయింట్లకు అర్హంగా పరిగణిస్తే, మరికొన్ని బ్యాంకులు ఎలాంటి పాయింట్లు ఇవ్వవు. కొన్ని బ్యాంకులు అయితే ఇలాంటి లావాదేవీలపై అదనపు ఛార్జీలు కూడా విధిస్తాయి. అందువల్ల అద్దె చెల్లించే ముందు మీ కార్డు నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

