కల్పన (సాత్విక వీరవల్లి) చిన్నప్పటి నుంచే వ్యోమగామి కావాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటుంది. అయితే ఆమె తండ్రి శివయ్యకు ఆడపిల్లలు ఎక్కువగా చదువుకోవడం ఇష్టం ఉండదు. పదో తరగతి పరీక్షలు కూడా పూర్తి చేయకుండానే పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అలా చిన్న వయసులోనే కల్పనకు కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో వివాహం జరుగుతుంది. మరోవైపు కృష్ణకు సొంతంగా కారు కొనుక్కుని డ్రైవర్‌గా స్థిరపడాలనే కోరిక ఉంటుంది. కానీ కల్పన కల గురించి తెలుసుకున్న తర్వాత ఆమె ఆశయాన్ని నెరవేర్చడమే తన లక్ష్యంగా మార్చుకుంటాడు. అందుకోసం గుజరాత్ వెళ్లి కష్టపడుతుంటాడు. కృష్ణ సహకారంతో కల్పన చదువులో ముందుకెళ్తూ అంతరిక్ష పరిశోధన రంగంలోకి అడుగుపెడుతుంది. అయితే ఆమె లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి. అసలు కల్పన తన కలను నెరవేర్చుకుందా? కృష్ణ ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? రోహిణి (శ్రుతి హాసన్) పాత్ర ఏంటి? అనేదే మిగతా కథ.
మహిళా సాధికారత, కలలను సాధించాలనే పట్టుదల, భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన వంటి అంశాలతో రూపొందిన చిత్రమిది. సాధారణంగా ఇలాంటి కథల్లో కమర్షియల్ హంగులు, భారీ ఎలివేషన్లు జోడించే అవకాశం ఉంటుంది. కానీ దర్శకుడు పవన్ సాధినేని మాత్రం ఎక్కడా కథ నుంచి పక్కకు వెళ్లకుండా చాలా హానెస్ట్‌గా సినిమాను తెరకెక్కించాడు. అసభ్యకరమైన సన్నివేశాలు, అనవసరమైన ఫైట్లు, ఐటమ్ సాంగ్స్, కుళ్లు జోకులు లేకుండా ఒక క్లీన్ అండ్ నీట్ సినిమాగా ప్రజెంట్ చేశాడు.
ఫస్టాఫ్‌లో గుజరాత్లో కృష్ణ ప్రయాణం, బిజిలీతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కల్పన బాల్యం, ఆమె ఆశయం, కృష్ణతో వివాహం, ఆ తర్వాత ఆమె కోసం కృష్ణ నిలబడే సన్నివేశాలు భావోద్వేగంగా సాగుతాయి. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపిస్తుంది. కల్పన లక్ష్యం వైపు ప్రయాణాన్ని మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్లో వచ్చే మిషన్ ఫెయిల్యూర్ ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్‌లో శ్రుతి హాసన్ రోహిణి పాత్రతో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. కృష్ణ, కల్పన, రోహిణి మధ్య సన్నివేశాలు ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అయితే కథలో వచ్చే కొన్ని మలుపులు ముందే ఊహించేలా ఉంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మాత్రం హృదయానికి హత్తుకుంటాయి. తండ్రితో కూతురు మాట్లాడే సన్నివేశం, అంతరిక్షంలో కల్పన అనుభవించే భావోద్వేగాలు సినిమాకు బలంగా నిలుస్తాయి.
నటీనటులు పర్ఫార్మెన్స్:
కల్పన పాత్రలో సాత్విక వీరవల్లి అద్భుతంగా నటించింది. అమాయకత్వం, పట్టుదల, భావోద్వేగాలను చక్కగా పలికించింది. కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. భార్య కలను తన కలగా భావించే భర్తగా మెప్పించాడు. శ్రుతి హాసన్ తన పాత్రకు ప్రత్యేకమైన ఎనర్జీని తీసుకొచ్చింది. రుహానీ శర్మ, నాజర్, మురళీ శర్మ, స్వాసిక తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. సీజీ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. మాటలు, ఆర్ట్, కాస్ట్యూమ్స్ సహజంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
– మంచి కథ, సందేశం
– దుల్కర్, సాత్విక, శ్రుతి హాసన్ నటన
– దర్శకుడి టేకింగ్
– ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్
– అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
– ముందే ఊహించగలిగే కొన్ని సన్నివేశాలు
– మరింత బలంగా ఉండాల్సిన కొన్ని కీలక ఎమోషనల్ సీన్స్
చివరిగా.. ఆకాశంలో ఒక తార అందమైన భావోద్వేగ ప్రయాణం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కల ఉంటుంది. ఆ కలను సాధించడానికి కుటుంబం నుంచి ప్రోత్సాహం లభిస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చనే విషయాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ముఖ్యంగా మహిళల ఆశయాలను గౌరవించాలనే మంచి సందేశాన్ని అందించాడు. నెమ్మదిగా సాగే కథనాన్ని ఓపికగా చూడగలిగితే ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. కుటుంబంతో కలిసి చూడదగిన క్లీన్ అండ్ నీట్ మూవీ.
