Last Updated:
అపెక్ (APEC) సదస్సులో పాల్గొనేందుకు చైనా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి వీరిద్దరూ చారిత్రాత్మక త్రైపాక్షిక భేటీ నిర్వహించనున్నారు.
అపెక్ (APEC) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బుధవారం చైనా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. షెన్జెన్ విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన జిన్‌పింగ్, ఎయిర్ ఫోర్స్ వన్ విమానం దిగిన ట్రంప్‌కు రెడ్ కార్పెట్‌పై ఆత్మీయ స్వాగతం అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ జెండాలు చేతబూనిన ప్రజలు రంగురంగుల పామ్-పామ్‌లతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. జిన్‌పింగ్ పక్కన నిలబడి సెల్యూట్ చేసిన ట్రంప్, అనంతరం ఆయనతో కరచాలనం చేశారు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరు దేశాధినేతలు కలుసుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య ఒప్పందాలపై వీరిద్దరూ కీలక చర్చలు జరపనున్నారు.
అపెక్ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చారిత్రాత్మక త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ప్రపంచంలోని మూడు అత్యంత శక్తిమంతమైన దేశాల అధినేతలు ఒకే వేదికపై త్రైపాక్షిక చర్చలు జరపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
WATCH LIVE: Trump’s Grand Welcome in China as President XI receives him on Arrival
#donaldtrump #xijinping #usa #china #uschina #news #apecsummitSOURCE: US NETWORK POOL VIA REUTERS https://t.co/x8d61EMwwN
— ANI (@ANI) November 18, 2026
గురువారం జరగనున్న ఈ త్రైపాక్షిక సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షెన్జెన్లో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చీలికలు, సైనిక-రాజకీయ ప్రమాదాలు పెరుగుతున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో విభజన కంటే ఐక్యత, ఆధిపత్యం కంటే సమానత్వం, హెచ్చరికల కంటే చర్చలే అత్యవసరమని పుతిన్ స్పష్టం చేశారు.

