Last Updated:
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 23వ ఆసియాన్-ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచానికి నేడు శాంతి, స్థిరత్వం అవసరమని, దేశాల మధ్య పోటీ కాకుండా పరస్పర సహకారం ఉండాలని పిలుపునిచ్చారు.
భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానం ఆసియాన్ దేశాలతో సంబంధాలకు కొత్త ఊపును, లోతైన బంధాన్ని ఇచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా మంగళవారం జరిగిన 23వ ఆసియాన్-ఇండియా సదస్సులో ప్రధాని ప్రసంగించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో దేశాల మధ్య పోటీ కాకుండా పరస్పర సహకారం అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగో వంతు వాటా కలిగిన భారత్, ఆసియాన్ దేశాల భవిష్యత్తు సహకారంతోనే రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.
గత కొన్నేళ్లుగా ప్రపంచం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోందని, నేడు ప్రపంచానికి అత్యంత అవసరమైనది శాంతి, స్థిరత్వమని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది సదస్సు ఇతివృత్తం ‘కలిసి మన భవిష్యత్తును నిర్మించుకుందాం’ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు.
భారత్-ఆసియాన్ భాగస్వామ్యం కేవలం ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి మాత్రమే పరిమితం కాకుండా డిజిటల్, రక్షణ, అంతరిక్ష రంగాల్లోకి విస్తరించిందని ప్రధాని వివరించారు. 2014 నుంచి ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు వందకు పైగా కార్యక్రమాలు చేపట్టామని, దాదాపు 250 క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం 10 వేలకు పైగా స్కాలర్షిప్లు అందించామని, నేరుగా విమాన సర్వీసులు, పెరుగుతున్న పర్యాటకం ఇరు పక్షాల సాన్నిహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఈ సదస్సులో భాగంగా విపత్తు నిర్వహణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై ఇరు పక్షాలు సహకారం పెంచుకునేందుకు అంగీకరించాయి.
భారత్ అభివృద్ధి, ఆసియాన్ శ్రేయస్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ‘ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045’, ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలు ఇరు ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆసియాన్ ఐక్యతకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఈ సదస్సు సురక్షితమైన ఇండో-పసిఫిక్ నిర్మాణానికి దోహదపడుతుందని చెప్పారు. అంతకుముందు మనీలాలోని పురాతన ఖల్సా దివాన్ గురుద్వారాను ప్రధాని సందర్శించి, అనంతరం 21వ తూర్పు ఆసియా సదస్సులోనూ పాల్గొన్నారు.

