Last Updated:
జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కడం, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటితో పాటు చాలామందికి ఆకలి తగ్గిపోతుంది. ఎంత ఇష్టమైన ఆహారం ఎదురుగా ఉన్నా తినాలనిపించదు. కొందరికి నోరంతా చేదుగా అనిపిస్తుంది.
సాధారణంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు లేదా వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కడం, నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటితో పాటు చాలామందికి ఆకలి తగ్గిపోతుంది. ఎంత ఇష్టమైన ఆహారం ఎదురుగా ఉన్నా తినాలనిపించదు. కొందరికి నోరంతా చేదుగా అనిపిస్తుంది. నాలుకపై పాచి పట్టినట్లు ఉండటంతో ఆహారం రుచిగా అనిపించదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ప్రముఖ పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ వివరించారు. దీని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని తెలిపారు.
జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది?
శరీరంలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు దానితో పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో శరీరం సైటోకైన్స్ అనే ప్రత్యేక రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మెదడులో ఆకలిని నియంత్రించే కేంద్రంపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ సమయంలో శరీరంలో జరిగే సహజమైన ప్రతిస్పందనల్లో ఇది కూడా ఒకటి. అందుకే జ్వరం వచ్చినప్పుడు సాధారణ రోజుల మాదిరిగా ఆహారం తినాలనిపించదు. జ్వరం తగ్గిన తర్వాత చాలామందిలో ఆకలి క్రమంగా తిరిగి వస్తుంది.
నోరు చేదుగా ఎందుకు అనిపిస్తుంది?
జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉండటం, ఆహారం రుచి తెలియకపోవడం కూడా సాధారణంగా కనిపించే సమస్యలే. ఇన్ఫెక్షన్ సమయంలో శరీరంలో జరిగే మార్పులు రుచి తెలుసుకునే సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. నాలుకపై ఉండే రుచి మొగ్గల పనితీరు తాత్కాలికంగా మారుతుంది. దీనికి తోడు జ్వరం వల్ల చెమట ఎక్కువగా పట్టడం, తగినంత నీరు తాగకపోవడం వంటి కారణాలతో శరీరంలో నీటి శాతం తగ్గవచ్చు. నోరు పొడిబారడం, లాలాజలం తగ్గడం వల్ల కూడా ఆహారం చేదుగా లేదా రుచి లేనట్లుగా అనిపించవచ్చు.
జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
జ్వరం వచ్చినప్పుడు ఆకలి లేకపోయినా శరీరానికి అవసరమైన ద్రవాలు అందించడం చాలా ముఖ్యం. నీళ్లు, మజ్జిగ, సూప్, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను తగినంతగా తీసుకోవచ్చు. ఆకలి ఉన్నప్పుడు అన్నం, పప్పు, పెరుగు అన్నం, కిచిడీ, ఇడ్లీ వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా తినాలని బలవంతం చేసుకోకూడదు. జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే కామెర్లు వస్తాయనే అపోహ కూడా కొందరిలో ఉంది. చికెన్ తినడం వల్ల మాత్రమే కామెర్లు రావు. అయితే మాంసాహారాన్ని పూర్తిగా ఉడికించి, పరిశుభ్రంగా తయారు చేసుకోవాలి.
జ్వరం తగ్గకుండా కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నీరసం, నిరంతర వాంతులు లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. జ్వరం సమయంలో శరీరానికి విశ్రాంతి, తగినంత ద్రవాలు, పోషకాహారం అందించడం ముఖ్యం.

