Last Updated:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వెండితెరపై తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పటికే పలు వ్యాపారాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ ఇండస్ట్రీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘షార్ట్‌గన్ గేమ్స్’ (Shortgun Games) లో మహేశ్ బాబు వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా (Strategic Investor) చేరారు.
ఈ భాగస్వామ్యంతో షార్ట్‌గన్ గేమ్స్ సంస్థ ‘టేక్‌డౌన్: జెనెసిస్’ (Takedown: Genesis) అనే సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ గేమ్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్లు, విడుదల తేదీ, ప్లాట్‌ఫామ్స్ వంటి కీలక అంశాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అలాగే, ఈ గేమింగ్ కంపెనీలో మహేశ్ బాబు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. “కథలోని లోతు, అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ సంస్కృతి – ఈ మూడింటి కలయికతో రూపుదిద్దుకుంటున్న అంతిమ వినోద ప్రపంచమే ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్. భారతదేశంలో అపారమైన సృజనాత్మక ప్రతిభ ఉంది. ఇక్కడి నుంచే సరికొత్త పాత్రలను, అద్భుతమైన కథా ప్రపంచాలను సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సమయం ఆసన్నమైంది. ఈ సంస్థతో కలిసి పనిచేయడానికి నన్ను ఆకర్షించిన అంశం జీత్ చందన్, విధిత్ మెహతాల దూరదృష్టి, వారి లక్ష్యాలపై ఉన్న స్పష్టత. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అత్యున్నత స్థాయి PC, కన్సోల్ గేమింగ్ అనుభవాలను అందించాలనే వారి సంకల్పం ఎంతో గొప్పది. స్పష్టమైన సాంకేతిక ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఇలాంటి యువ, ప్రతిభావంతులైన సృజనకర్తలకు మద్దతుగా నిలవడం ఎంతో స్ఫూర్తినిస్తోంది. ‘PROJECT TAKEDOWN’తో ప్రారంభమవుతున్న ఈ ఉమ్మడి ప్రయాణంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది.”
మహేశ్ బాబు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తన మార్క్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఆసియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ (AMB) సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ బిజినెస్ లో సక్సెస్ అయ్యారు. ‘హంబుల్’ పేరిట సొంత క్లాతింగ్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. అలాగే ఏఎన్ (AN) బ్రాండ్ తో రెస్టారెంట్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడంతో దేశంలో గేమింగ్ మార్కెట్ భారీ టర్నోవర్‌తో దూసుకుపోతోంది. ఈ తరుణంలో మహేశ్ బాబు గేమింగ్ రంగంలోకి ప్రవేశించడం సరైన నిర్ణయమని వ్యాపార విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టేక్‌డౌన్: జెనెసిస్’ గేమ్‌కు మహేశ్ బ్రాండ్ ఇమేజ్ భారీ క్రేజ్ తీసుకొస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా వారణాసి చేస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.

