మాస్క్డ్ ఆధార్ ఎందుకు ముఖ్యమో చూస్తే మొదటిది, వ్యక్తిగత సమాచారం భద్రత. పూర్తి ఆధార్ నంబర్ అనేది చాలా ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం. అది ఇతరుల చేతికి చిక్కినా, బయటపడినా దుర్వినియోగం లేదా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. మాస్క్డ్ ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు కనిపించవు కాబట్టి, ఇతరులతో పంచుకునే సమాచారం పరిమితంగా ఉంటుంది. గుర్తింపు పత్రాన్ని సమర్పించాల్సిన సందర్భాల్లో వ్యక్తిగత వివరాలను కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రెండోది, నిబంధనలకు అనుగుణంగా ఉండటం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కొన్ని సంస్థలకు పూర్తి ఆధార్ నంబర్లను సేకరించవద్దని, అనుమతి లేకుండా వాటిని నిల్వ చేయవద్దని సూచించాయి. ఇలాంటి సందర్భాల్లో మాస్క్డ్ ఆధార్ ఉపయోగించడం ద్వారా పూర్తి ఆధార్ నంబర్‌ను బయటపెట్టకుండానే గుర్తింపును నిర్ధారించుకోవచ్చు. మూడోది, ఉపయోగించుకోవడం సులభం. గుర్తింపు కోసం ఆధార్ అవసరమైనా, పూర్తి నంబర్ అవసరం లేని సందర్భాల్లో మాస్క్డ్ ఆధార్ మంచి ప్రత్యామ్నాయం. దీన్ని ఈ-ఆధార్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ప్రింట్ తీసుకోవచ్చు లేదా స్క్రీన్‌షాట్ ద్వారా పంచుకోవచ్చు. దీనివల్ల పూర్తి ఆధార్ నంబర్ బయటపడే ప్రమాదం తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

