Last Updated:
Trump: ఇరాన్‌పై అమెరికా ఎటువంటి సైనిక దాడి చేయబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ రోజున ఇరాన్‌పై ఎలాంటి అమెరికా దాడి ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు.
ఆదివారం విలేకరులు ‘ఇరాన్‌పై అమెరికా దాడి చేయనుందా?’ అని ప్రశ్నించగా, ట్రంప్ తొలుత స్పందిస్తూ.. “ఆ విషయం నేను మీకు చెప్తానా?” అని చమత్కరించారు. అనంతరం, “ప్రస్తుతానికి సమాధానం ‘లేదు’. ఈ రోజు ఎలాంటి దాడి జరగదు” అని అల్ జజీరా నివేదిక ప్రకారం ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ చేసిన ఈ ప్రకటన కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితమని, భవిష్యత్తులో ఇరాన్‌పై సైనిక చర్యలు ఉండబోవని దీని అర్థం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం అంతకుముందు మాట్లాడిన ట్రంప్.. టెహ్రాన్‌తో ఏదైనా ఒప్పందానికి రావాలా లేదా సైనిక చర్యలను కొనసాగించాలా అనే అంశంపై ఇంకా ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. “పనిని పూర్తిగా ముగించాలా (finish the job) లేదా ఒప్పందం చేసుకోవాలా అనేదే ఇక్కడి ఎంపిక” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారమే దాడి జరగవచ్చన్న గత సంకేతాల నుంచి ఈ తాజా వ్యాఖ్యలు కాస్త భిన్నమైన మలుపుగా కనిపిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు నిలిచిపోయినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా అమెరికాతో దౌత్యపరమైన సందేశాల మార్పిడి ఇప్పటికీ జరుగుతోందని ఇరాన్ వెల్లడించింది. అయితే, పూర్తిగా ‘లొంగిపోవాలని’ అమెరికా చేస్తున్న డిమాండ్లను టెహ్రాన్ తిరస్కరిస్తూనే, దౌత్య మార్గాలు మాత్రం తెరిచే ఉంచామని పేర్కొంది. వాషింగ్టన్‌తో సమన్వయం చేసుకుంటూ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం ఖతార్ మధ్యవర్తులు టెహ్రాన్‌లో పర్యటించినట్లు చర్చల సమాచారం తెలిసిన వర్గాలు తెలిపాయి.
అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ వ్యవహారం అమెరికా-ఇరాన్ ప్రతిష్టంభనలో ప్రధాన అంశంగా మారింది. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే, ఈ జలసంధిని తిరిగి తెరవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా తెలియజేసినట్లు పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి తెలిపారు. అయితే, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఒక మీడియా సంస్థ దీనిని ఖండిస్తూ, అలాంటి కొత్త ప్రతిపాదన ఏదీ చేయలేదని పేర్కొంది.
ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దౌత్య ప్రయత్నాలలో నెలకొన్న అనిశ్చితిని, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతానికి అక్టోబర్ 25న దాడిని ట్రంప్ తోసిపుచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ఎలాంటి సైనిక లేదా దౌత్య పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

