Last Updated:
టాలీవుడ్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్ రామచంద్ర ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో మంచానికే పరిమితమై ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన కమెడియన్ రామచంద్ర ప్రస్తుతం బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతంతో మంచానికే పరిమితమై ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ‘వెంకీ’ సినిమాలో రవితేజ స్నేహితుల గ్యాంగ్‌లో ఒకరిగా నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆయన పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. సినిమా పరిశ్రమలో పైకి కనిపించే రంగుల ప్రపంచం వెనుక ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల జీవితాలు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటాయనడానికి రామచంద్ర ప్రస్తుత స్థితే ప్రత్యక్ష నిదర్శనం. అవకాశాలు ఉన్నప్పుడు వచ్చే అరకొర పారితోషికాలతో జీవనం సాగించే చిన్న నటులు, ఇలాంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడితే వైద్య ఖర్చులు భరించలేక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు.
పక్షవాతం కారణంగా రామచంద్ర శరీరంలో కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు బ్రెయిన్ ట్యూమర్‌కు సుదీర్ఘ చికిత్స అందించాల్సి ఉండటంతో ఆసుపత్రి బిల్లులు లక్షల రూపాయల్లో అవుతున్నాయి. వైద్యానికి అవసరమైన డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న ఆయన, దాతలు, సినీ పరిశ్రమ పెద్దలు స్పందించి తనకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ విషాదకర పరిస్థితుల్లో ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, ‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా నటుడు కాదంబరి కిరణ్ తదితరులు ముందుకొచ్చి రామచంద్రకు తమ వంతు ఆర్థిక సాయం అందించారు.
రామచంద్ర పేరు చెబితే వెంటనే గుర్తురాకపోయినా, స్క్రీన్ మీద చూస్తే తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. జూనియర్ ఎన్టీఆర్ తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ ద్వారా ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన ఆయన, రెండు దశాబ్దాల పాటు అనేక సినిమాల్లో తన మార్క్ చూపించారు. ‘ఆనందం’, ‘సొంతం’, ‘దుబాయ్ శీను’, ‘కింగ్’, ‘లౌక్యం’ వంటి చిత్రాల్లో హీరో స్నేహితుడిగా నటించి మెప్పించారు. ముఖ్యంగా వెంకీ సినిమాలో రైలు ఎపిసోడ్‌లో ఆయన చేసిన కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. తన నటనతో ఎంతోమందిని నవ్వించిన ఓ కమెడియన్, నేడు ప్రాణాలు నిలబెట్టుకోవడానికి మంచం పైనుంచి దాతల సాయం అభ్యర్థించడం సినీ అభిమానులను కలచివేస్తోంది.

