Last Updated:
H1B Visa: అమెరికా కలలు కనే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తీవ్ర నిరాశ కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం హెచ్-1బీ వీసా విధానాన్ని అత్యంత కఠినతరం చేయడంతో ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చుకున్నాయి. భారత్ నుంచి నిపుణులను హెచ్-1బీ వీసాపై అమెరికా ప్రాజెక్టులకు పంపే ప్రధాన సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ లాటరీ దరఖాస్తులను అనూహ్యంగా తగ్గించాయి. ఈ మేరకు కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన తాజా నివేదిక కీలక అంశాలను వెల్లడించింది.
గతంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులను హెచ్-1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ చేయించిన సంస్థలు ఇప్పుడు దాదాపు నామమాత్రపు స్థాయికి పరిమితం చేశాయి. కాగ్నిజెంట్: 2025-26లో 3,752 దరఖాస్తులు చేయగా, 2026-27 నాటికి ఏకంగా సున్నాకు (100% తగ్గుదల) తగ్గించింది. టీసీఎస్: గతంలో 5,955 రిజిస్ట్రేషన్లు చేయగా, ఈ ఏడాది కేవలం 284 దరఖాస్తులకు (95% క్షీణత) పరిమితమైంది. ఇన్ఫోసిస్: గతంలో 8,886 దరఖాస్తులు చేయగా, ఇప్పుడు కేవలం 759 రిజిస్ట్రేషన్లను (91% క్షీణత) మాత్రమే నమోదు చేసింది.
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన భారీ ఫీజులు, నూతన విధానాలే ఈ పెను మార్పులకు ప్రధాన కారణంగా మారాయి. కొత్త దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు రూ. 85 లక్షలు) వరకు ఫీజును ప్రతిపాదించడం, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పిటిషన్లపై అదనంగా సుమారు రూ. 98 లక్షల ($1,18,265) ఫీజులను తీసుకురావాలనే ఆలోచన కంపెనీలపై విపరీతమైన భారాన్ని మోపుతోంది. దీనికితోడు కనీస వేతనాల పెంపు కారణంగా కంపెనీలకు తొలి ఏడాదే దాదాపు 1.46 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14,000 కోట్లు) అదనపు వ్యయం కానుందని అంచనా.
వెయిటెడ్ సెలక్షన్ విధానం – భారత నిపుణులపై ప్రభావంగతంలో లాటరీలో ఉన్న సాధారణ ర్యాండమ్ డ్రా విధానాన్ని రద్దు చేసి, అత్యధిక వేతనం, ఉన్నత సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యమిచ్చే ‘వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్’ను తీసుకురావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో భారత్ నుంచి ఎంట్రీ-లెవల్, సాధారణ ఐటీ సపోర్ట్ ఇంజనీర్లను అమెరికా పంపడం పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కంపెనీలు ఇప్పటికే అమెరికాలో ఉన్న నిపుణులను తీసుకోవడం, లోకల్ అమెరికన్లకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం లేదా కేవలం వీసా పొడిగింపులపై మాత్రమే ఆధారపడుతున్నాయి.

