కేవలం ఇళ్లే కాకుండా నివాస, కార్యాలయ (Office), రిటైల్, గిడ్డంగుల (Warehousing) విభాగాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. నిర్మాణాత్మక రియల్ ఎస్టేట్ మొత్తం విలువ 2009లోని 94 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 503 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది ఐదు రెట్లకు పైగా సంభవించిన విస్తరణ. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో నివాస విభాగం (Residential Sector) వాటా 2009లో 48 శాతంగా ఉండగా, 2025 నాటికి అది 85 శాతానికి ఎగబాకింది. ఇది దేశంలో సొంతింటి కొనుగోలుదారుల నుండి కనిపిస్తున్న అపారమైన డిమాండ్‌ను కళ్ళకు కడుతోంది. వాణిజ్య విభాగం పరంగా ఆఫీస్ స్పేస్ రంగాలు అతిపెద్ద విభాగాలుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ నివేదికలో అందరి దృష్టినీ ఆకర్షించిన మరో ప్రధాన విభాగం గిడ్డంగులు (Warehousing). ఈ-కామర్స్ విజృంభణ, సప్లై చైన్ ఆధునీకరణ కారణంగా 2009లో దాదాపు సున్నా స్థాయిలో ఉన్న గిడ్డంగుల రంగం, 2025 నాటికి ఏకంగా 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన పరిశ్రమగా రూపాంతరం చెందడం గమనార్హం.

