Last Updated:
రిలయన్స్ జియో ఐపీఓలో ఒకే డీమ్యాట్ ఖాతా నుంచి రెండుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చనే ఓ ఆసక్తికరమైన ట్రిక్ నెట్టింట వైరల్ అవుతోంది. రిలయన్స్ షేర్లు కొంటే షేర్‌హోల్డర్ కోటా కింద అదనపు అవకాశం లభిస్తుందనే ప్రచారంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఐపీఓకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ట్రిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం ఒకే డీమ్యాట్ ఖాతా ఉపయోగించి ఈ ఐపీఓకు ఏకంగా రెండుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు ముందుగా మాతృ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులకు జియో ఐపీఓలో వాటాదారుల రిజర్వేషన్ (షేర్‌హోల్డర్ కోటా) కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే ప్రత్యేక అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
ఇదే సమయంలో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో కూడా మరో దరఖాస్తు చేసుకోవచ్చని, తద్వారా ఐపీఓలో షేర్లు అలాట్ అయ్యే అవకాశాలు రెట్టింపు అవుతాయని సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి.
గతంలో మార్కెట్లోకి వచ్చిన కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఎన్ఎల్సీ ఇండియా వంటి ప్రముఖ సంస్థల ఐపీఓల సమయంలోనూ ఇన్వెస్టర్లు ఇదే తరహా విధానాన్ని ఉపయోగించి లాభపడినట్లు ఈ ప్రచారంలో గుర్తుచేస్తున్నారు. అయితే ఒకే డీమ్యాట్ ఖాతా లేదా ఒకే పాన్ (PAN) నంబర్ ఆధారంగా రెండు వేర్వేరు కేటగిరీల్లో దరఖాస్తు చేయడం నిజంగానే అనుమతిస్తారా అనేది కీలక ప్రశ్నగా మారింది. ఈ విషయం పూర్తిగా ఐపీఓ అధికారిక నిబంధనలు, మార్కెట్ నియంత్రణ మండలి సెబీ (SEBI) మార్గదర్శకాలు, జియో ఐపీఓ తుది ఆఫర్ డాక్యుమెంట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను గుడ్డిగా నమ్మి తొందరపడకుండా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. జియో ఐపీఓకు దరఖాస్తు చేసే ముందే కంపెనీ విడుదల చేసే అధికారిక ఐపీఓ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా అందులో వాటాదారుల రిజర్వేషన్ ఉందా లేదా, దానికి సంబంధించిన అర్హత తేదీ, దరఖాస్తు పరిమితులు, ఒకే పాన్ లేదా డీమ్యాట్ ఖాతాకు వర్తించే నిబంధనలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

