Last Updated:
ఏఐ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్ సంస్థలు కొత్త ఏఐ మోడళ్లను ప్రకటించాయి. కొత్త సామర్థ్యాలు అందుబాటులోకి వస్తున్న వేళ, ఏఐ భద్రత, మోడళ్ల పనితీరు, పర్యవేక్షణపై కూడా చర్చ మొదలైంది.
ఏఐ రంగంలో ఒకే రోజు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్ సంస్థలు కొత్త ఏఐ మోడళ్లను ప్రకటించాయి. ఇవి కొత్త సామర్థ్యాలను తీసుకొస్తున్నా, ఏఐ భద్రతపై మాత్రం కొత్త ఆందోళనలు, చర్చలకు దారితీశాయి. ఓపెన్ఏఐ త్వరలో తీసుకురానున్న ఆస్ట్రా ఏఐ మోడల్ తన ప్రిపేర్డ్నెస్ ఫ్రేమ్‌వర్క్‌లో ‘క్రిటికల్’ సైబర్‌సెక్యూరిటీ సామర్థ్య స్థాయిని చేరుకున్న తొలి మోడల్‌గా నిలిచిందని ప్రకటించింది. అయితే ఆస్ట్రాలో ఉపయోగించిన కొత్త ఆర్కిటెక్చర్ వల్ల మోడల్ ఎలా ఆలోచిస్తుందో పూర్తిగా పర్యవేక్షించడం కష్టమవుతుందా? అంటూ ఏఐ భద్రతా పరిశోధకులు, నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు ఆంథ్రోపిక్ రెండు కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. క్లాడ్ ఫాబుల్ 5.1, క్లాడ్ మిథోస్ 5.1 మోడళ్లు కోడింగ్, శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన బెంచ్‌మార్క్ పరీక్షల్లో అగ్రస్థాయి స్కోర్లు సాధించాయని సంస్థ తెలిపింది. సాధారణ వినియోగాల్లో ధరలను సుమారు 25 శాతం తగ్గించినట్లు కూడా ప్రకటించింది. గూగుల్ కూడా జెమిని 3.8 ఫ్లాష్, జెమిని 3.8 ఫ్లాష్ సైబర్ అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. వీటితో పాటు ఏజెంటిక్ వీడియో సామర్థ్యాలు, చిత్రాలను రూపొందించి ఎడిట్ చేసుకునే గూగుల్ పిక్స్ అనే కొత్త టూల్‌ను తీసుకొచ్చింది.

